మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. రీసెంట్‌గానే ‘పుష్ప 2’ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పనుల్ని పూర్తి చేశారు. ప్రస్తుతం ఓజీ, రాజా సాబ్, గేమ్ చేంజర్, డాకు మహారాజ్ వంటి చిత్రాలతో తమన్ ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో తమన్ తన పుట్టిన రోజు (నవంబర్ 16)ని గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసుకోనున్నారు. ఈ క్రమంలో మీడియాతో తమన్ ముచ్చట్లు పెట్టారు. ఆయన చెప్పిన విశేషాలివే..
* తమన్ గారు.. మీరు ఇన్ని ప్రాజెక్టుల్ని ఎలా ఒప్పుకుంటున్నారు? ఎలా హ్యాండిల్ చేస్తున్నారు?
ఒకప్పుడు రొటీన్ చిత్రాలు వచ్చేవి. కానీ ఇప్పుడు డిఫరెంట్ కథలు వస్తున్నాయి. రకరకాల కాన్సెప్టులు వస్తున్నాయి కాబట్టి డిఫరెంట్ మ్యూజిక్ ఇస్తున్నాను. నాకు చాలా ఆనందంగా ఉంది. ‘తెలుసు కదా’, ‘ఓజీ’, ‘గేమ్ చేంజర్’, ‘డాకు మహారాజ్’ ఇలా దేనికదే చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ‘డాకు మహారాజ్’ చిత్రంలో మూడు పాటలే ఉంటాయి. గేమ్ చేంజర్‌లో ఏడు పాటలుంటాయి. శంకర్ గారు చాలా ఏళ్ల తరువాత ఓ ప్రాపర్ కమర్షియల్ సినిమాను చేస్తున్నారు. సాంగ్స్, ఫైట్స్ ఇలా ఏది కావాలంటే అది ఉంటుంది. ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా గేమ్ చేంజర్ ఉంటుంది.
* సంక్రాంతికి మీతో మీకే పోటీ ఉండేలా కనిపిస్తోంది?
బాలయ్య గారిది సంక్రాంతికి, రామ్ చరణ్ గేమ్ చేంజర్ డిసెంబర్‌కి వస్తుందనేది ముందుగా ఉన్న ప్లాన్. కానీ చివరకు గేమ్ చేంజర్ సంక్రాంతికి వచ్చింది. దాని కోసం దిల్ రాజు ఎన్నో అడ్జస్ట్మెంట్లు చేశారు. ఎంతో కష్టపడ్డారు. సంక్రాంతికి ఆయన చిత్రమే మరోకటి ఉంది. అందరితో మాట్లాడుకుని అందరికీ సర్ది చెప్పి గేమ్ చేంజర్‌ను జనవరి 10న ఫిక్స్ చేశారు.
* ఆర్ఆర్ విషయంలో మీరు తీసుకునే జాగ్రత్తలు ఏంటి?
సినిమాలో ఎమోషన్ లేకపోతే నేను ఎంత కొట్టినా వేస్ట్. కథకు తగ్గట్టుగా, దర్శకుడు తీసిన దానికి అనుగుణంగా నేను మ్యూజిక్ ఇస్తాను. అఖండకు ఇచ్చినట్టుగా భగవంత్ కేసరికి ఇవ్వలేను. బీజీఎం అనే దానికి మణి గారి తరువాత ట్రెండ్ క్రియేట్ చేయాలని చూస్తున్నాను. కొన్ని చిత్రాలకు వాయిస్ ఎక్కువగా వినిపించాలి.. ఇంకొన్ని చిత్రాలకు పరికరాల సౌండ్ ఎక్కువగా వినిపించాలి. అఖండకు చేసే టైంలో శివుడే నాలోకి వచ్చి చేయించినట్టుగా అనిపిస్తుంది. మళ్లీ ఆ రేంజ్ బీజీఎం ఇస్తానో లేదో నాకు తెలీదు.
* పుష్ప 2 కోసం పని చేయడం ఎలా అనిపిస్తోంది?
పుష్ప 2 చూసి భయపడ్డాను. అద్భుతంగా వచ్చింది. ఈ మూవీ తరువాత అవార్డులన్నీ కూడా బన్నీకి గారి కోసం పరిగెత్తుకుంటూ వస్తాయి. పది హేను రోజుల్లో సినిమా మొత్తం కంప్లీట్ చేయమన్నారు. అది సాధ్యం కాదు. అందుకే నాకున్న టైంలో ఫస్ట్ హాఫ్‌ను దాదాపుగా కంప్లీట్ చేసి ఇచ్చాను.
* మీరు ఇంకా సాధించాల్సింది ఏమైనా ఉందని అనుకుంటున్నారా?
నేను ఇప్పటి వరకు ఏమీ సాధించలేదు. ఇకపై సాధించాల్సింది ఉంది. ప్రస్తుతం మన ఇండస్ట్రీ ఎదుగుతూ వస్తోంది. ఒకప్పుడు పక్క భాషలు, రాష్ట్రాల నుంచి ఆర్టిస్టుల్ని తీసుకొచ్చుకునే వాళ్లం. ఇప్పుడు గ్లోబల్ వైడ్‌గా ఫేమస్ ఆర్టిస్టులు మన చిత్రాల్లో నటిస్తామని వస్తున్నారు. ఓజీ కోసం కొరియన్, జపాన్ వాళ్లతో చర్చిస్తున్నాం. మన స్పాన్ పెరుగుతోంది. ఇంకా నేను కొత్తగా నేర్చుకుని గ్లోబల్ స్థాయికి తగ్గట్టుగా ఇవ్వాల్సి ఉంటుంది.
* మ్యూజిక్‌లో మీకు స్పూర్తి ఎవరు?
ఏఆర్ రెహమాన్ స్థాయికి వెళ్లాలి అనేది నా కల. బాయ్స్ టైంలో శంకర్ గారు నాలో యాక్టర్‌ని చూశారు. నేను మంచి మ్యూజిక్ డైరెక్టర్‌ని అని గుర్తించేందుకు ఇన్నేళ్లు పట్టింది. శంకర్ గారి సినిమాకు మ్యూజిక్ ఇవ్వాలనేది నా కల. కానీ శంకర్ గారు, సుకుమార్ గారు వంటి వారి స్టైల్‌కి నేను సరిపోను అనుకునేవాడ్ని. అందుకే వాళ్ల నంబర్లు కూడా నా దగ్గర ఉండవు. లాక్డౌన్ టైంలో శంకర్ గారు అల వైకుంఠపురములో సినిమాను కొన్ని వందల సార్లు చూశారట. దిల్ రాజు గారు నాకు ఈ గేమ్ చేంజర్ ప్రాజెక్ట్ గురించి చెప్పినప్పుడు, శంకర్ గారిని వెళ్లి కలవమని చెప్పినప్పుడు భయం వేసింది. ఆరు నెలల్లోనే ఆల్బమ్ కంప్లీట్ అయింది.
* గేమ్ చేంజర్ సాంగ్స్ ఎలా ఉండబోతోన్నాయి? శంకర్ గారు ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేశారు?
గేమ్ చేంజర్ నుంచి నెక్ట్స్ 20వ తేదీన ఒక డ్యూయెట్ సాంగ్ రిలీజ్ చేస్తాం. ఆ తరువాత అమెరికాలో ఓ గ్రాండ్ ఈవెంట్ ప్లాన్ చేసి డోప్ అనే పాటను రిలీజ్ చేస్తాం. ఆ పాట ఇంగ్లీష్ వర్షెన్ కూడా ఉంటుంది. గేమ్ చేంజర్ సాంగ్ పిక్చరైజేషన్ చూసి మైండ్ బ్లాక్ అయింది. వాటిని చూసేందుకు రెండు కళ్లు చాలలేదు. చాలా రోజుల తరువాత పర్ఫెక్ట్ కమర్షియల్ సాంగ్‌లను చూడబోతోన్నాం. అసలు ఆ ఆరు పాటలకే టికెట్ డబ్బులు ఇచ్చేయొచ్చు. శంకర్ గారు గేమ్ చేంజర్‌లో ముందుగా ఆరు పాటల్ని షూట్ చేశారు. ఆ తరువాతే సీన్లను షూట్ చేశారు.
* రాజా సాబ్ నుంచి అప్డేట్లు ఎప్పుడు ఉండబోతోన్నాయి?
రాజా సాబ్‌లో ఆరు పాటలుంటయి. ఓ రీమేక్ సాంగ్ కూడా ఉంటుంది. ప్రాపర్ కమర్షియల్ సినిమాకు ఉన్నట్టే సాంగ్స్ ఉంటాయి. జనవరి నుంచి పాటల అప్డేట్లు ఇవ్వాలని అనుకుంటున్నాం.
* మీపై వచ్చే విమర్శల గురించి ఏం చెబుతారు?
ఒకప్పుడు మూసధోరణిలో ఉన్న సినిమాలకు కంటిన్యూగా మ్యూజిక్ ఇస్తూ వచ్చాను. ఆ టైంలో కాపీ క్యాట్, కాపీ గోట్ అని ట్రోల్ చేశారు. మళ్లీ అలాంటి రొటీన్ చిత్రాలను సెలెక్ట్ చేసుకోవడం లేదు. తెలివైన వాళ్లు చాలా జాగ్రత్తగా కాపీ కొడతారు. ఎక్కడి నుంచి కొట్టారో కనిపెట్టలేం. కానీ నాకు అంత తెలివి లేదు. కాపీ కొట్టడం రాదు. అందుకే వెంటనే దొరికిపోతాను(నవ్వులు)
* పవన్ కళ్యాణ్ ఓజీ నుంచి అప్డేట్లు ఎప్పుడు ఉంటాయి?
ఓజీ గురించి నేను ఏం మాట్లాడినా డీసీఎంకి చేరుతుంది. అందుకే నేను జాగ్రత్తగా మాట్లాడుతున్నాను. సెప్టెంబర్ 2న పాట, పోస్టర్ రిలీజ్ చేద్దామని అనుకున్నారు. కానీ ఆయన వరదల ప్రభావంతో అందరూ బాధపడుతున్నారు. ఇప్పుడు రిలీజ్ చేయొద్దని అన్నారు. జనవరి నుంచి అప్డేట్లు ఇస్తాం. దాదాపు 80 శాతం షూటింగ్ అయిపోయింది. ఇంత వరకు ఇండియాలో రానటువంటి ఓపెనింగ్స్ ఓజీకి వస్తాయి. ఆయన్ను మీట్ అయ్యేందుకే కష్టపడుతున్నాం. ఇంకా పాటలు పాడించడం ఏంటి? (నవ్వులు)
* మీ పర్సనల్ విషయాలు చెప్పండి? భార్య, పిల్లలు ఏం చేస్తుంటారు?
నా భార్యే నా అకౌంట్, మ్యూజిక్ వ్యవహారాలన్నీ చూస్తారు. నాకు ఏమైనా అవసరాలు పడితే డబ్బులు అడుగుతాను. ఆమె ఇస్తారు. నా కొడుకు ఐఐటీ ఫస్ట్ ఇయర్. నా ఫ్యామిలీ కూడా నెమ్మదిగా హైదరాబాద్‌కు షిఫ్ట్ అవుతోంది.
* మీరు ఇన్ని పనుల్ని ఎలా హ్యాండిల్ చేస్తారు? మీ టీం ఎలా సపోర్ట్ చేస్తుంటుంది?
నా మొదటి రెమ్యూనరేషన్ రూ. 30. కీ బోర్డ్ ప్లేయర్‌గా నేను ఒక రోజుకి గరిష్టంగా 40 వేలు తీసుకున్నా. ఇండియాలో అదే హయ్యస్ట్. రోజంతా పని చేశాక సాయంత్రం నిర్మాత వచ్చి డబ్బులు ఇచ్చి వాటిని ఇంటికి తీసుకెళ్లడంలో కిక్కు ఉంటుంది. నేను సంతోషాన్ని వెతుక్కుంటూ వెళ్తుంటాను. నా 25 ఏళ్లుగా టీం నా వెంటే ఉంటుంది. వాళ్లే నా బలం.
* అల్లు అర్జున్-త్రివిక్రమ్ ప్రాజెక్టుకి కూడా మీరే మ్యూజిక్ ఇస్తారా?
బన్నీ-త్రివిక్రమ్ నెక్ట్స్ ప్రాజెక్ట్‌ని కూడా చేస్తున్నాను. ఆ సినిమాతో త్రివిక్రమ్ గారు నెక్ట్స్ లీగ్‌కు వెళ్తారు. అసలు ఆయన ఎప్పుడో వెళ్లాల్సింది. ఈ ప్రాజెక్ట్ కోసం త్రివిక్రమ్ కొత్త ప్రపంచాన్ని చూపించబోతోన్నారు. అదేంటో మీకు త్వరలోనే తెలుస్తుంది.
* మీ నుంచి కంప్లీట్ లవ్ స్టోరీ సినిమా ఆల్బం చూసి చాలా కాలం అయింది కదా?
తెలుసు కదా చిత్రానికి నీరజ కోన అద్భుతమైన ప్రేమ కథ రాసుకున్నారు. ఆమెను పీపుల్స్ మీడియా విశ్వ ప్రసాద్ గారు చాలా సపోర్ట్ చేస్తున్నారు. అందులో ఆరు పాటలు అద్భుతంగా ఉంటాయి. సిద్దుకి మంచి కారెక్టర్ దొరికింది. సినిమా అద్భుతంగా ఉంటుంది. ప్రస్తుతం పుణెలో షూటింగ్ జరుగుతోంది. తొలిప్రేమ తరువాత నాకు మంచి లవ్ స్టోరీ అవుతుంది. మళ్లీ రెండు లవ్ స్టోరీలను ఒప్పుకున్నాను. అందులో ఒక్క సినిమా చేసిన అతనే హీరోగా నటిస్తున్నాడు. నాకు కథ చాలా నచ్చింది కాబట్టే ఆ ప్రాజెక్టుని ఒప్పుకున్నాను.
* అఖండ పనులు ఏమైనా ప్రారంభించారా?
అఖండ 2 పనులు స్టార్ట్ చేశాను. ఆల్రెడీ ఒక పాట అయిపోయింది.
* మీ జీవిత ఆశయం, కల ఏంటి?
మ్యూజికల్ స్కూల్ కట్టాలని నా కోరిక. ఆర్థికంగా వెనుకబడిన వారికి ఫ్రీగా మ్యూజిక్ నేర్పించాలని అనుకుంటున్నాను. మ్యూజిక్ ఉన్న చోట క్రైమ్ రేట్ చాలా తక్కువగా ఉంటుంది. నేను క్రికెట్ ఆడి వస్తే.. వెంటనే ఓ ట్యూన్ వస్తుంది. క్రికెట్ ఆడటంలో నాకు చాలా ఆనందం ఉంటుంది. రెండు, మూడేళ్లలో వరల్డ్ క్లాస్ స్టూడియోని ఇక్కడే కడతాను. ప్రభుత్వం తరుపున ఏమైనా సాయం చేస్తారా? అని కూడా అడుగుతాను. స్థలం ఇవ్వమని మాత్రం అడగను.
* మీ కొడుకు కూడా మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడా?
నా కొడుకు వాయించే తీరు చూసి వాడు ఏ ఎమోషన్స్‌లో ఉన్నాడో చెబుతాను. నా కొడుక్కి నేను సలహాలు ఇవ్వను. ఈ రూట్ బెటర్ ఆ రూట్ బెటర్ అని చెప్పను. అనుభవంతో తెలుసుకుంటాడు అని వదిలేస్తాను. అన్నీ తెలుసుకుని అనుభవంతో తిరిగి వస్తాడని చూస్తాను.
* కొందరు మ్యూజిక్ సిట్టింగ్స్ కోసమని బ్యాంకాక్, ఇతర దేశాలకు వెళ్తుంటారు?దానిపై మీ అభిప్రాయం?
నేను నిర్మాత తరుపున ఆలోచిస్తాను. నేను విదేశాలకు వెళ్లి మ్యూజిక్ కొట్టను. ఇక్కడే ఆటోలో కూర్చుని కొట్టమన్నా కొడతాను. నిర్మాతకు ఎంత తక్కువ వీలైత అంత తక్కువ ఖర్చు అవ్వాలని చూస్తాను. టైంకి మ్యూజిక్ ఇవ్వాలని చూస్తాను.
* ఓజీలో అకిరా నందన్‌తో మ్యూజిక్ చేయించుకుంటున్నారా?
ఓజీలో రమణ గోగుల గారితో ఓ పాట పాడించాలని చూస్తున్నాను. అకిరా పియానో అద్భుతంగా ప్లే చేస్తాడు. ఓజీ కోసం అకిరాను పిలుస్తాను. అకిరా చేతి వేళ్లు కూడా చాలా పెద్దగా ఉంటాయి. పర్ఫెక్ట్ పియానో ప్లే చేసే వ్యక్తిలా ఉంటాడు. రెండు నెలలు నాతో అకిరా పని చేశాడు.
0 Comments