ఆల్ టైమ్ క్లాసిక్ సాగర సంగమం 37 సంవత్సరాలు పూర్తి

 ఆల్ టైమ్ క్లాసిక్ సాగర సంగమం  37 సంవత్సరాలు పూర్తి



విశ్వనాధ్ గారి అపూర్వమైన చిత్రాలలో ఒకటైన "సాగర సంగమం"  పూర్ణోదయా మూవీ క్రియేషన్స్ పతాకంపై ఏడిద నాగేశ్వరరావు నిర్మించాడు. ఇందులో గాయని ఎస్.పి.శైలజ, శరత్ బాబు ముఖ్యమైన పాత్రల్లో నటించారు. ఎస్.పి. శైలజ తన జీవితానికి ఈ ఒక్క పాత్ర చాలునని మళ్ళీ నటించలేదు.ఈ సినిమాలో శైలజ ప్రియుడిగా నటించిన అరుణ్ కుమార్ కు డబ్బింగ్ చెప్పాడు. జయప్రద భర్త పాత్ర పోషించిన మోహన్ శర్మకు గాయకుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం డబ్బింగ్ చెప్పాడు. "వేవేల గోపెమ్మలా" పాటలో దర్శకుడిగా నటించిన వ్యక్తికి నిర్మాత నాగేశ్వరరావు డబ్బింగ్ చెప్పాడు


పతాక సన్నివేశాల్లో వచ్చే "వేదం అణువణువున నాదం" పాట చిత్రీకరణకు ముందు హాసన్ కు ఓ హిందీ సినిమా షూటింగులో కాలికి తీవ్రమైన గాయమైంది. దాంతో, నెలరోజులపాటు ఈ సినిమా చిత్రీకరణను వాయిదా వేశారు. ఆ తరువాత విడుదలకు ఆలస్యమవుతుందని పునః ప్రారంభించారు. అయితే, అప్పటికీ హాసన్ ఇంకా కోలుకోలేదు. అడుగు తీస్తే అడుగు వేయలేని పరిస్థితిలో ఉన్నాడతడు. అయినప్పటికీ నృత్యం చేయడానికి పూనుకున్నాడు. "షాట్" అనగానే నృత్యం చేయడం, "కట్" అనగానే క్రింద పడిపోవడం. అలా, ఆ పాట పూర్తయింది.


ఈ సినిమాను మద్రాసు, విశాఖపట్నం, హైదరాబాదు, ఊటీలో చిత్రీకరించారు. "వేవేల గోపెమ్మలా" పాటను విశాఖపట్నంలోని భీమిలి బీచులోనున్న పార్క్ హోటల్లో, అందులో వచ్చే ఊహా దృశ్యాలను మద్రాసులోని విజయ గార్డెన్స్ లో చిత్రీకరించారు. జయప్రద ఇంట్లో జరిగే సన్నివేశాలు, "మౌనమేలనోయి" పాట, సముద్రపు ఒడ్డులో తీసిన సన్నివేశాల్నీ విశాఖపట్నంలోనే చిత్రీకరించారు. "ఓం నమఃశివాయ" పాటను హైదరాబాదులో చిత్రీకరించారు. పత్రికా కార్యాలయంలోని సన్నివేశాలను ఖైరతాబాద్ లోని ఈనాడు కార్యాలయంలో చిత్రీకరించారు. మద్యం మత్తులో ఓ బావి మీదున్న పైపుపై కమల్ హాసన్ నాట్యం చేసే "తకిట తథిమి" పాటను మద్రాసులోని అరుణాచలం స్టూడియోలో 30 అడుగుల బావి సెట్ వేసి తీశారు. "నాదవినోదము" పాటను ఊటీలో తీశారు. 


కథానాయకుడి పాత్రకు కమల్ హాసన్ ని సంప్రదించగా అతడు నిరాకరించాడు. సినిమా అంతా ముసలివాడిగా కనిపిస్తే ఆ తరువాత అలంటి పాత్రలే వస్తాయన్నది అతడి భయం. పైగా అంతకుముందు ముసలివాడిగా నటించిన "కడల్ మీన్గళ్" అనే తమిళ సినిమా పరాజయం పొందడంతో హాసన్ కు ఆ సెంటిమెంట్ బలంగా ఉండేది. ఆ పాత్రను అతడితోనే చేయించాలన్న నిర్మాత నాగేశ్వరరావు ఐదారు నెలలు అతడి వెంటపడి బతిమాలి ఒప్పించాడు. కథానాయికగా ముందుగా జయసుధను అనుకున్నారు. ఆమెకు వేరే సినిమాలతో ఖాళీ లేకపోవడంతో జయప్రదను ఎంచుకున్నారు. శైలజ పాత్రకు నృతం తెలిసిన ఓ కొత్త అమ్మాయిని ఎంపిక చేసుకోవాలని అనుకున్నాడు దర్శకుడు విశ్వనాథ్. అప్పుడే నృత్యం నేర్చుకుంటున్న ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం చెల్లెలు ఎస్.పి.శైలజను ఆ పాత్రకు సిఫార్సు చేశాడు నాగేశ్వరరావు. అందుకు విశ్వనాథ్, బాలసుబ్రహ్మణ్యం ఒప్పుకున్నారు. శంకరాభరణంతో పేరు సంపాదించిన మంజు భార్గవి ఈ సినిమాలో ఓ పెళ్ళి సన్నివేశంలో నృత్య ప్రదర్శన ఇస్తూ కనిపిస్తుంది


 ఖైరతాబాద్ వినాయక విగ్రహం ముందు హాసన్ నృత్యం చేసే ఘట్టం. ఆ ప్రాంతంలో చిత్రీకరించే సమయంలో దర్శకుడు విశ్వనాథ్కి ఓ ఆలోచన వచ్చింది. అదే, ఓ సినిమా నృత్య దర్శకుడి వద్ద సహాయకుడిగా చేరడానికి వెళ్ళి, అక్కడి పరిస్థితుల వల్ల మథనపడి, వినాయక విగ్రహం ముందు నృత్యం చేసే ఘట్టం. ఆ సన్నివేశం మొత్తాన్ని అప్పటికప్పుడు అనుకొని పెట్టడం జరిగింది. ఆ నృత్య ఘట్టంలో నేపథ్య సంగీతంగా పండిట్ రవిశంకర్ మ్యూజిక్ బిట్ ని వాడమని సిఫార్సు చేశాడు హాసన్. విశ్వనాథ్ కు ఆ ఆలోచన నచ్చడంతో వెంటనే తన ఇంట్లో ఉన్న రవిశంకర్ ఎల్.పి.రికార్డుని తెప్పించాడు హాసన్. జయప్రద ఇచ్చిన డాన్స్ ఫెస్టివల్ ఆహ్వాన పత్రికలో తన ఫోటోను చూసుకొని హసన్ ఉద్వేగంతో ఏడవడం వరకు మొదట అనుకున్న సన్నివేశం. అయితే, దాన్ని చిత్రీకరించే సమయంలో విశ్వనాథ్ కెమెరా వెనుక నుండి నవ్వమని హాసన్ కు సైగ చేశాడు. అలా చెప్పిన వెంటనే హసన్ ఏడుపులోంచి నవ్వులోకి మారిపోయాడు.

Post a Comment

0 Comments