'బెదురులంక 2012' ప్రపంచంలోకి తీసుకెళ్లిన వీడియో...
కార్తికేయ, 'డీజే టిల్లు' ఫేమ్ నేహా శెట్టిల సినిమా షూటింగ్ పూర్తి  


- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - 

కార్తికేయ గుమ్మకొండ కథానాయకుడిగా నటించిన సినిమా 'బెదురులంక 2012'. లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 3గా రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సి. యువరాజ్ చిత్ర సమర్పకులు, క్లాక్స్ దర్శకుడు. ఇందులో కార్తికేయ సరసన 'డీజే టిల్లు' ఫేమ్ నేహా శెట్టి కథానాయిక. సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఈ సందర్భంగా 'ద వరల్డ్ ఆఫ్ బెదురులంక' అని ఓ వీడియో విడుదల చేశారు.

ఓ పల్లెటూరిలో 2012 యుగాంతం నేపథ్యంలో జరిగే కథతో 'బెదురులంక 2012' చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు దర్శక - నిర్మాతలు ఇంతకు ముందు తెలిపారు. 'ద వరల్డ్ ఆఫ్ బెదురులంక 2012' వీడియోలో ఆ ఊరిని, అందులో మనుషులను పరిచయం చేశారు. 

విశాలమైన గోదావరి... తీరంలో పచ్చటి కొబ్బరి చెట్లు... మధ్యలో మనుషులు... బండి మీద దూసుకు వెళుతున్న కథానాయకుడు కార్తికేయ... ఊరు ఎలా ఉంటుందో వీడియో ప్రారంభంలో చూపించారు. కళ్ళకు కనిపించే విజువల్ కంటే చెవులకు వినబడే సంగీతం సెకన్లలో మైండ్‌కు ఎక్కేసేలా ఉంది. 

''హొయ్ రబ్బోయ్... ఓరి నాయనా...
ఇదేంట్రోయ్... ఈ మాయ'' అని నేపథ్యంలో సాంగ్ వినిపిస్తుంటే... స్క్రీన్ మీద నిజంగా మాయ జరుగుతున్నట్లు ఉంటుంది. వెంటనే విజువల్‌తో కనెక్ట్ అవుతాం. 

''అయ్ బాబోయ్...
ఆగలేం రోయ్...
వచ్చేయండ్రోయ్...
వెయిటింగ్ ఇక్కడ''
అని సాంగ్ వినిపిస్తున్న సమయంలో ఫుడ్ కోసం వెయిటింగ్ చేస్తున్న జనాలు అందరూ ఒక్కసారిగా తిండి మీద పడితే... ప్రేమ కోసం పరితపించే జంటను మరోవైపు చూపించారు. 

సుమారు నిమిషం నిడివి గల టీజర్‌లో కార్తికేయ, నేహా శెట్టి  మధ్య ప్రేమతో పాటు అజయ్ ఘోష్, రాజ్ కుమార్ బసిరెడ్డి, గోపరాజు రమణ, 'ఆటో' రామ్ ప్రసాద్ క్యారెక్టర్లనూ దర్శకుడు క్లాక్స్ పరిచయం చేశారు. యుగాంతం వస్తుందని ఊరిలో ప్రజలు అందరూ ఎంజాయ్ చేసే విధానం నవ్వులు పూయించేలా ఉంది. 

'ఇదంతా సూతంటే నీకు ఏమనిపితంది' అని అజయ్ ఘోష్ అడిగితే 'మంచి ఫన్నీగా ఉంది' అని చెప్పాలనిపిస్తుంది. 'ద వరల్డ్ ఆఫ్ బెదురులంక' ఎలా ఉంటుందో వీడియోలో చక్కగా చూపించారు. 

చిత్రనిర్మాత బెన్నీ ముప్పానేని మాట్లాడుతూ "మా సినిమా చిత్రీకరణ అంతా పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఫుల్ స్వింగులో అన్ని వర్క్స్ జరుగుతున్నాయి. సినిమా బాగా వస్తోంది. ప్రేక్షకులు అందరినీ నవ్వించే కొత్త తరహా చిత్రమిది. డ్రామెడీ (డ్రామా ప్లస్ కామెడీ) జానర్ చిత్రమిది. అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నాం. జనవరి తొలి వారంలో టీజర్ విడుదల చేయాలనుకుంటున్నాం'' అని చెప్పారు.

దర్శకుడు క్లాక్స్ మాట్లాడుతూ "కార్తికేయ, నేహా శెట్టి జోడీ మధ్య కెమిస్ట్రీ 'ద వరల్డ్ ఆఫ్ బెదురులంక' వీడియోలో చూశారు. వాళ్ళిద్దరి మధ్య సన్నివేశాలు అంత కంటే బావుంటాయి. మిగతా క్యారెక్టర్లు చేసే పనులు కూడా అంతే నవ్విస్తాయి. ప్రేక్షకుల నుంచి ఈ రోజు విడుదల చేసిన వీడియోకి మంచి స్పందన లభిస్తోంది. ఇది మాకు ఎంతో సంతోషంగా ఉంది. టీజర్, ట్రైలర్, సినిమాను త్వరలో మీ ముందుకు తీసుకు రావాలని ఉంది" అని చెప్పారు.

కార్తికేయ, నేహా శెట్టి జంటగా నటిస్తున్న ఈ సినిమాలో అజయ్ ఘోష్, రాజ్ కుమార్ కసిరెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్, 'ఆటో' రామ్ ప్రసాద్, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్, సత్య, సురభి ప్రభావతి, కిట్టయ్య, అనితానాథ్, దివ్య నార్ని ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి యాక్షన్: అంజి, పృథ్వీ కాస్ట్యూమ్ డిజైనర్: అనూషా పుంజాల, పి.ఆర్.ఓ: పులగం చిన్నారాయణ, ఎడిటింగ్: విప్లవ్ న్యాసదం, సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి, కిట్టూ విస్సాప్రగడ, కృష్ణ చైతన్య, ప్రొడక్షన్ డిజైన్: సుధీర్ మాచర్ల, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: దుర్గారావు గుండా, సినిమాటోగ్రఫీ: సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు, సన్నీ కూరపాటి, కొరియోగ్రాఫర్: బృంద, మోయిన్, సంగీతం: మణిశర్మ, సహ నిర్మాతలు: అవనీంద్ర ఉపద్రష్ట, వికాస్ గున్నల, సమర్పణ: సి. యువరాజ్, నిర్మాత: రవీంద్ర బెనర్జీ ముప్పానేని, రచన - దర్శకత్వం: క్లాక్స్. 


Post a Comment

0 Comments