ద బిగ్ ఫోక్ నైట్ 2025.




 
ఉద‌యం లేచింది మొద‌లు ప్ర‌తి ప‌నితో పాట ముడిప‌డి ఉంటది. మ‌నిషి మ‌నుగ‌డ‌తో పాటు పాట కూడా అభివృద్ధి  చెందుతూ వ‌స్తుంది. ప్ర‌పంచానికి తెలియ‌ని ఎన్నో అత్య‌ద్భుత‌మై‌న జాన‌ప‌దాలు వంద‌లు, వేలు బ‌య‌టికి వ‌స్తున్నా, ఇంకా ల‌క్షణంగా ఉండే ల‌క్ష‌ల పాట‌లు మ‌ట్టిలోనే ఉండిపోయాయి. ఆ ల‌క్ష‌ల పాట‌ల‌ను వెలికితీసి భావి త‌రాల‌కు అందిస్తున్న తెలంగాణ జాన‌ప‌ద గాయ‌కుల‌కు ప‌బ్బ‌తిగ‌ట్టి బిగ్‌టీవీ పాటాభిషేకం చేస్తున్న‌ది. పాట‌కు బ‌తునివ్వ‌డానికి బ‌తుకుకు పాట‌నివ్వ‌డానికి బిగ్‌టీవీ స‌గ‌ర్వంగా స‌మ‌ర్పిస్తున్న కార్య‌క్ర‌మం ద బిగ్ ఫోక్ నైట్ 2025.
 
ద బిగ్ ఫోక్ నైట్ -2025 లైవ్ ఫోక్ మ్యూజిక‌ల్ కాన్సెర్ట్ పోస్ట‌ర్‌, ప్రోమో లాంచ్ కార్య‌క్ర‌మం.. శుక్ర‌వారం సాయంత్రం 5 గంట‌ల‌కు మాదాపూర్‌లోని నోవాటెల్ హోట‌ల్‌లో అట్ట‌హాసంగా జ‌రిగింది. 60 మంది తెలంగాణ జాన‌ప‌ద ర‌చ‌యిత‌లు, గాయ‌కులు, సంగీత ద‌ర్శ‌కులు పాల్గొని కార్య‌క్ర‌మాన్ని వినోద‌భ‌రితం చేశారు. ఇప్ప‌టివ‌ర‌కూ జ‌ర‌గ‌ని ఈ కార్య‌క్ర‌మానికి బిగ్‌టీవీ ఒక కొత్త‌ పంథాకు శ్రీ‌కారం చుట్టింది. ఎలిమెంట‌ల్ మీడియా ద్వారా, ఎంట్రీవాలా టికెటింగ్ పార్ట్‌న‌ర్లుగా ద బిగ్ ఫోక్ నైట్ కార్య‌క్ర‌మం భారీ ఎత్తున జ‌రుప‌నున్నారు.
 
బిగ్ టీవీ సీఈఓ అజ‌య్ రెడ్డి  కొండా మాట్లాడుతూ.. తెలంగాణ జాన‌ప‌దం‌లో ఇంకా మ‌ట్టి ప‌రిమ‌ళం మిగిలి ఉన్న‌ది. త‌ర‌త‌రాల వార‌స‌త్వం నుంచి వ‌స్తున్న జాన‌ప‌దానికి త‌మవంతుగా ఏదైనా చెయ్యాల‌ని త‌ల‌పెట్టిన కార్య‌క్ర‌మమే ద బిగ్ ఫోక్ నైట్ 2025 అని అన్నారు. ఆగ‌స్టు 23న శ‌నివారం నాడు హైద‌రాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌తో ఈ కార్య‌క్ర‌మ ఏర్పాట్లు చేస్తున్నామ‌న్నారు. 60 మంది తెలంగాణ జాన‌ప‌ద క‌ళాకారులు క‌లిసి ఒకే వేదిక‌ను పంచుకోవడం ఇదే మొద‌టిసారి.. అలాంటి అవ‌కాశం ఇలా త‌మ సంస్థ రూపంలో రావ‌డం త‌మ‌ అదృష్టం అని అన్నారు. ‌
 
ప్ర‌ముఖ ర‌చ‌యిత సుద్దాల అశోక్ తేజ మాట్లాడుతూ..ఒక మైకెల్ జాక్స‌న్‌, ఒక బుపెన్ హెజారికా, ఒక నూరాన్ సిస్ట‌ర్స్‌, ఒక రేష్మ‌, ఒక గద్ద‌ర్ ఒకే వేదిక‌పై క‌నిపించే భాగ్యం ఈ త‌రం నోచుకోలేదు. కానీ వాళ్ల‌కు ధీటుగా, సాటిగా, మేటిగా తెలంగాణ జాన‌ప‌ద క‌ళాకారులు అక్ష‌ర న‌క్ష‌త్రాల గాత్రులై ఒక మ‌హా వేదిక‌పైన ఒకే సారి క‌నిపిస్తే ఎలా ఉంటుందో మాటల్లో వ్య‌క్తిక‌రించ‌లేం.. త‌ప్ప‌కుండా చూసి తీరాల్సిందే అన్నారు.
 
 
సంగీత ద‌ర్శ‌కులు వందేమాత‌రం శ్రీ‌నివాస్ మాట్లాడుతూ.. చ‌రిత్ర‌లో క‌నీవినీ ఎరుగ‌ని రీతిలో  తెలంగాణ జాన‌ప‌ద గాయ‌కులంద‌రినీ ఒకే వేదిక‌పై చూసే అదృష్టం చాలా అరుదుగా వ‌స్తుంది. అలాంటి అరుదైన కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టిన బిగ్‌టీవీకి అభినంద‌న‌లు. ఈ కార్య‌క్ర‌మంలో న‌న్ను భాగ‌స్వామిగా చేసినందుకు ఆనందంగా ఉంద‌న్నారు.
 
వేదిక‌పై మ‌ధుప్రియ‌, రాము రాథోడ్‌, క‌న‌క‌వ్వ ఇత‌రులు చేసిన జాన‌ప‌ద పాట‌ల‌, నృత్య ప్ర‌ద‌ర్శ‌న ఆక‌ట్టుకున్న‌ది. ఊర్రుత‌లూగించింది.

Post a Comment

0 Comments