ఈ జూలైతో తెలుగు ఫిలింఛాంబర్ ఆఫ్ కామర్స్ కు ఎన్నుకున్న ప్రస్తుత కమిటీ గడువు ముగుస్తుంది. నిబంధనల ప్రకారం వెంటనే ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలి. కానీ ఈ అసోసియేషన్ లోని కొందరు వ్యక్తులు స్వార్థంతో ఎన్నికలను వాయిదా వేయాలని ప్రయత్నిస్తున్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ అసోసియేషన్ బై లా ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలంటూ ఈ రోజు నిర్మాతలు డా.ప్రతాని రామకృష్ణ గౌడ్, బసిరెడ్డి ఆధ్వర్యంలో తెలుగు ఫిలింఛాంబర్ లోని నాలుగు సెక్టార్స్ నుంచి దాదాపు 60 మంది నిర్మాతలు మెమొరాండం సమర్పించారు.
తెలుగు ఫిలింఛాంబర్ లో ఇటీవల జరిగిన ఈసీ మీటింగ్ లో ఎన్నికల వాయిదా అంశాన్ని ప్రతిపాదించారని, ఈసీ మీటింగ్ కు రాని ఒక సభ్యుడు ప్రతిపాదించిన దానికి మిగతా వారు ఎలా ఒప్పుకుంటారని ఈ రోజు మెమొరాండం సమర్పించిన నిర్మాతలు నిలదీశారు. అసోసియేషన్ లోని సి కల్యాణ్, అశోక్ కుమార్, మోహన్ గౌడ్, రాందాస్ వంటి పెద్దలు ఈ ప్రతిపాదన వ్యతిరేకించి ఎన్నికలు జరపాలని కోరారని నిర్మాతలు వెల్లడించారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే ఎన్నికల వాయిదా వేస్తారని, అందుకు జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించి దాదాపు నెల రోజుల ముందే తెలియజేయాలని వారు అన్నారు. ఎన్నికల వాయిదా ప్రతిపాదనకు నొచ్చుకుని ఒకరిద్దరు నిర్మాతలు రాజీనామా చేశారని, వారికి బాసటగా ఉంటామన్నారు. చిత్రపురి కాలనీలో అవినీతి జరిగింది అనేది అందరికీ తెలిసిందేనని, కొత్తగా నిర్మించే ఫ్లాట్స్ ను తెలుగు ఫిలింఛాంబర్ కు చెందిన పేద సినీ కార్మికులకు కేటాయించాలని నిర్మాతలు కోరారు.
మొమరాండం సమర్పణ అనంతరం నిర్మాతలు మాట్లాడుతూ - ఇటీవల తెలుగు ఫిలింఛాంబర్ లో ఈసీ మీటింగ్ నిర్వహించారు. 48 మందికి ఓటు హక్కు ఉండగా 38 మంది హాజరయ్యారు. ఇప్పుడున్న కమిటీ సభ్యులు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు సన్నిహితంగా ఉన్నారని, అందుకే ఈ బాడీనే కొనసాగించాలని ఒక ఈసీ మెంబర్ లేఖ రాశాడు. ఆ లేఖను పట్టుకుని 34 మంది సభ్యులు అంగీకారం తెలిపారు. ఇది మీడియా ద్వారా ప్రచారం చేయించి ఈసారి ఎన్నికలు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. తెలుగు ఫిలింఛాంబర్ లో కొందరు గుత్తాధిపత్యం చెలాయిస్తున్నారు. వారికి మిగతా సభ్యులు సపోర్ట్ చేయొద్దని కోరుతున్నాం. నిబంధనలు పాటించడం లేదు. ఒకరిద్దరు సభ్యులు మాత్రం తమ ఎన్నిక గడువు ముగిసినందున పదవులకు రాజీనామా చేస్తూ లెటర్స్ రాస్తున్నారు. వారిని అభినందిస్తూ, మిగతా వారు కూడా అలాగే గౌరవంగా ఎన్నికల కోసం ముందుకు రావాలి. గతంలో కరోనా టైమ్ లో మాత్రమే ఎన్నికలు వాయిదా వేశాం. తెలుగు ఫిలింఛాంబర్ నిబంధనల్లోనూ మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. ఎవరు ఎన్నికైనా సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం తెలుగు ఫిలింఛాంబర్ నుంచి రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు రిప్రంజెటేషన్స్ ఇస్తాం అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు గురురాజ్, అల్లాభక్స్, శంకర్ రెడ్డి, బులెట్ రవి, వింజమూరి మధు తదితరులు పాల్గొన్నారు.
0 Comments